(ఇష్టమైన ఆహారము చూడగానే నోరు ఊరుతుంది ఎందుకు ?)
-ఎస్. సాయివినయ్, విశాఖపట్నం
జవాబు : మనకు ఇష్టమైన పదార్ధము వాసన వచ్చినా , కనిపించినా ... నోటిలో లాలాజలం ఊరి ఆపదార్దము తినాలనిపిస్తుంది .ఇది అప్రయత్నం గా జరిగే చర్య . మనిషికి కలిగే అనుభవాలు మెదడులో నమోదవుతుంటాయి . ఒక సారి తిని బాగా ఇస్టపడిన వంటకము రుచి , వాసన , చూపు , మెదడులో నమోదు అవుతాయి . మరోసారి ఆ వాసన తగిలినా , ఆ పదార్ధము కనిపించినా గత అనుభవాన్ని మెదడు నెమరు వేసుకుంటుంది ... దీని ఫలితం గా మనకు నోరు ఊరుతుంది .
మన నాడీ వ్యవస్థలో భాగంగా స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ (autonomous nervous system) ఒకటుంది. పంచేద్రియాల ద్వారా గ్రహించే అవగాహనకు అనుకూలంగా మన శరీరం, మనసు స్పందించే తీరుతెన్నులు ఈ నాడీవిభాగం అజమాయిషీలోనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఎన్నో వివరాలను ఇవాన్ పెట్రోవిచ్ పావలోవ్ (1849-1936) అనే రష్యా శాస్త్రవేత్త కుక్కలపై ప్రయోగాలు చేసి నిరూపించడం విశేషం. ఆకలితో ఉన్న కుక్కకి రోజూ నిర్ణీత సమయానికి ఆహారం ఇస్తూ, అదే సమయంలో ఒక గంట శబ్దం వినిపించేలా చేసేవాడు. అలా చాలా రోజులు జరిగిన తర్వాత గంట శబ్దం వింటే చాలు కుక్క నోట్లో లాలాజలం ఊరడాన్ని గమనించాడు. అంటే ఆహారాన్ని చూడకపోయినా గంట శబ్దానికి కుక్క నోట్లో అసంకల్పితంగా లాలాజలం ఊరిందన్నమాట. ఇలా అనేక ప్రయోగాలు చేసి విశ్లేషించిన తర్వాత శరీరం, ఆలోచన, నాడీ ప్రక్రియలు ఉత్తేజితం కావడాన్ని సిద్ధాంతీకరించాడు. దాన్నే ఇప్పుడు మనం పావలోవ్ ప్రతీకార చర్య (pavlov's reflex), లేదా సాంప్రదాయ నియంత్రణ(classical conditioning)గా పాఠాల్లో చదువుకుంటున్నాం. ఈ పరిశోధనలకు గాను పావ్‌లోవ్‌కు వైద్యరంగంలో 1904లో నోబెల్ బహుమతి లభించింది. మనకు నచ్చే ఆహారాన్ని చూడగానే నోరూరడం ఈ అసంకల్పిత చర్యలో భాగమే. మనకు అలవాటు లేని కొత్త ఆహారాన్ని చూస్తే ఇలా జరగదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================================